ఎవ‌రి ఏడుపు వాళ్లు ఏడవాల్సిందే!

0
404

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవాలన్నది పార్టీ నిర్ణయం. ఆ ఎమ్మెల్యేలు అదే చేశారు. అత్యుత్సాహంలో కోమటిరెడ్డి హెడ్‌ఫోన్‌ విసిరికొట్టారు. అది మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కి తాకడం…ఆ తర్వాత ఆయన కంటికో బ్యాండేజ్‌తో హాస్పిటల్‌నుంచి బయటికి రావడం…మేము కోరుకున్నది ఇదేనని కాచుక్కూర్చున్నట్లు మర్నాడే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ సభనుంచి సస్పెండ్‌ చేస్తూ…ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాల్ని రద్దుచేస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం…అంతా పక్కా స్క్రిప్ట్‌లా చకచకా జరిగిపోయాయి. సభ్యత్వాలు రద్దయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ, అలంపూర్‌ స్థానాలు ఖాళీ అయ్యాయని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెజిట నోటిఫికేషన్‌..ఎమ్మెల్యేల గన్‌మెన్ల ఉపసంహరణ ఈ ఎపిసోడ్‌లో హైలెట్స్‌.

శాసనసభ్యత్వాల రద్దుపై ఎమ్మెల్యేలిద్దరూ కోర్టుకెక్కారు. ఆరువారాలపాటు ఎన్నికల బై ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వొద్దంటూ న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు, జనంలోకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ చేతిలో బోలెడంత మ్యాటర్‌ ఉంది. కానీ అలవాటైపోయిన బద్దకమో, లేకుంటే మరో కారణమోగానీ ఈ వ్యవహారమంతా వారి పర్సనల్‌ అనుకున్నట్లే వదిలేశారు పార్టీ సీనియర్లు. 24గంటల దీక్ష తర్వాత అసలేం జరగనట్లే ఉంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలిద్దరికీ(మాజీలు అనాలేమో?) కడుపుమండిపోతోంది. అందుకే..ఇంత పెద్ద ఇష్యూ జరిగితే రియాక్ట్ అయ్యే తీరు ఇదేనా అంటూ హైకమాండ్ ముందు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ గోడు వెళ్లబోసుకున్నారు.

జనంలోకి వెళ్లి రచ్చరచ్చ చేసి సానుభూతి సంపాదించుకోవాల్సిన విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలెందుకో లైట్‌ తీసుకున్నారు. పార్టీ ఆలోచన మేరకు సభలో ఫైట్‌ చేస్తే.. అండగా ఉండాల్సిన పార్టీ నాయకత్వం చోద్యం చూస్తోందన్న అసంతృప్తితో ఆ ఇద్దరు నేతలున్నారు. నాలుగురోజులు చూసినా తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవటంతో తమ గోడుని హైకమాండ్‌కి చెప్పుకునేందుకు ఢిల్లీలో మకాం వేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, కొప్పుల రాజును కలిసి జరుగుతున్న తతంగాన్ని చెప్పుకున్నారు. రాహుల్ గాంధీని కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల నిర్వాకాన్ని ఆయన్ని చెప్పాలనే నిర్ణయానికొచ్చారు కోమటిరెడ్డి, సంపత్.