సారీ..సారీ..సారీ..ఎన్నో సారి?

0
457

కోట్ల‌మంది ప్ర‌జ‌ల‌కు తెల్లారిలేస్తే మొహం చూసుకునే అద్దంలా మారిపోయిన‌ ఫేస్‌బుక్‌ వివాదాలకు కేంద్ర బిందువ‌వుతోంది. డేటా లీకేజీ ఆరోపణల‌తో ఫేస్‌బుక్ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. అమెరికా సహా పలు దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి బ్రిటన్‌ సంస్థ ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ 5 కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారాన్ని ఉపయోగించుకుందని ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలపై ఫేస్‌బుక్ కో ఫౌండ‌ర్ మార్క్‌ జూకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పారు. ఇలా క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం ఆయ‌న‌కిది ఆరోసారి.

పొరపాటు జరిగిందని ఫేస్‌బుక్‌ సీఈవో జూక‌ర్‌బర్గ్ అంగీకరించారు. 200 కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు తాము ప‌క‌డ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫేస్‌బుక్‌ సమాచారాన్ని పొందుతున్న వేల యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని జూక‌ర్‌బర్గ్ తెలిపారు. కేంబ్రిడ్జ్‌ పరిశోధకుడు రూపొందించిన యాప్‌ సాయంతో ఈ సమాచారాన్ని అనలిటికా కొల్లగొట్టింది. దీని సాయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లకు ఎరవేసినట్లు ఆరోపణలొచ్చాయి.

ఇదొక భారీ విశ్వాస ఘాతుకం. ఇలా జరిగినందుకు క్షమాపణలు. ఫేస్‌బుక్‌ను నేనే మొదలుపెట్టాను. ఈ వేదికపై ఏం జరిగినా చివరికి బాధ్యత వహించాల్సింది నేనే. ఖాతాదారుల సమాచారానికి భద్రత కల్పించడం మా బాధ్యత. దీనిలో విఫలమైతే.. మీకు సేవలు కల్పించే అర్హత కోల్పోయినట్లే. మేం చేయాల్సింది చాలా ఉందని అంగీకరిస్తున్నా. – జూక‌ర్‌బర్గ్‌

తెల్లారి లేచింది మొద‌లు రాత్రి గుడ్‌నైట్ చెప్పేదాకా ప‌ర్స‌న‌ల్‌గా దాచుకునేందుకు ఏమీ లేవ‌న్న‌ట్లు ప్ర‌తీదీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేంత‌గా కోట్ల‌మంది ఈ సామాజిక మాధ్య‌మానికి అల‌వాటుప‌డిపోయారు. ఎవ‌రి ఫేస్‌బుక్‌లోకి తొంగిచూసినా స‌కుటుంబ స‌ప‌రివార చిత్రం క‌నిపిస్తోంది. పుట్టుమ‌చ్చ‌లు స‌హా పుట్టుపూర్వోత్త‌రాల‌న్నీ అల‌వోక‌గా తెలిసిపోతున్నాయి. ఇప్పుడా ఫేస్‌బుక్ మ‌రోలా కూడా దుర్వినియోగం అవుతోంద‌న్న విష‌యం ప్ర‌పంచాన్ని షేక్ చేస్తోంది. అసలు ఏం జరిగిందో ప్రజలకు చెప్పడంలో ఆలస్య‌మైనందుకు ఫేస్‌బుక్ జూక‌ర్‌బ‌ర్గ్ విచారం వ్యక్తంచేసేస‌స‌రికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లు ఫేస్‌బుక్ దుర్వినియోగం కాకుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది ఫేస్‌బుక్‌. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల త‌ర‌హాలో దుర్వినియోగం జ‌ర‌గ‌కుండా…భారత్‌, బ్రెజిల్‌తోపాటు మరికొన్ని దేశాల్లో జర‌గనున్న ఎన్నికల సమయంలో కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగిస్తామ‌ని ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. అయితే సమాచార భద్రతకు ఫేస్‌బుక్‌ ప్రతిపాదించిన చర్యలు సరిపోవంటోంది బ్రిటన్‌.