మనం బాగుంటే చాలు. మన సుఖసంతోషాలకోసం ఎవరినైనా చిదిమేసేంత రాక్షసత్వాన్ని అణువణువునా నింపుకుంటున్నారు కలికాలపు మనుషులు. మొన్నా మధ్య తన పెళ్లాం ఆరోగ్యంకోసం బోసినవ్వుల పాపాయి తల తెగ్గోసి చంద్రగ్రహణం రోజున శాంతిచేశాడో రాక్షసుడు. ఎనిమిదినెలల గర్భిణిని కిరాతకంగా కడతేర్చి, శరీరాన్ని ముక్కలు చేసి రోడ్డుపై విసిరేశారు మనుషుల్లా సంచరిస్తున్నా మృగాలు.
హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ దగ్గర లభించిన మహిళ మృతదేహం మిస్టరీ వీడింది. అక్రమ సంబంధాల మోజులో గాల్లో కలుస్తున్న ప్రాణాల్లో ఈ అభాగిని చేరిపోయింది. భర్త కళ్లెదుటే అతనితో అక్రమసంబంధం నెరిపే మహిళ నిలువునా ప్రాణాలు తీస్తే, ఆమెను ముక్కలుగా నరికి మూటగట్టి పడేసే డ్యూటీ కొడుకు తీసుకున్నాడు. ఆమె ఆరేళ్ల కొడుకు కళ్లెదుటే జరిగిపోయిందీ దారుణం.
భర్త వివాహేతర సంబంధం ఆ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. ఆమె ఈ అక్రమసంబంధాన్ని ప్రశ్నించడం మహిళకు, ఆమె భర్తకు, కుమారుడికి నచ్చలేదు. అడ్డు తొలగించుకుంటే ఏ గొడవా ఉండదని ఆ గర్భిణి భర్తకు నూరిపోశారు. నలుగురూ కలిసి నిండు చూలాలిని కిరాతకంగా చంపేశారు. గ్రానైట్ రాళ్లను కోసే మిషిన్‌తో శరీరాన్ని ముక్కలు చేశారు. రెండు గోనె సంచుల్లో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు.
హైదరాబాద్ సిద్దిఖీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో జరిగిందీ ఘోరం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ దంపతులు తమ 6 ఏళ్ల కొడుకుతో ఉంటున్నారు.ఇదే ఇంట్లో ఉండే బీహార్‌కు చెందిన అనిల్ ఝా భార్య మమతా ఝాతో వికాస్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం వికాస్ భార్యకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో వికాస్, మమతా, ఆమె కుమారుడు అమర్‌కాంత్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు వెల్లడైంది. మమతాఝూ భర్త వీరికి సహకరించాడు.
ఓ బైక్ సాయంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. జనవరి 29 తెల్లవారుజామున యమహాపై ఇద్దరు బొటానికల్ గార్డెన్ వద్ద రెండు రౌండ్లు తిరిగినట్లు పోలీసులు సీసీ ఫుటేజీలో గుర్తించారు. బైక్ యజమాని ద్వారా ఆ బండి రెండు చేతులు మారినట్లు గుర్తించి చివరికి అమర్‌కాంత్‌ను పట్టుకుని తమ స్టయిల్‌లో విచారించటంతో మర్డర్ నేపథ్యమంతా బయటికి వచ్చింది.